గోదావరి-ఏలేరు అనుసంధానానికి అడుగులు

News

రాజమహేంద్రవరం, నవంబర్ 7: గోదావరి నది వరద నీటిని సత్వరం సద్వినియోగం చేసుకోవడానికి ఏలేరు, పంపా, తాండవ నదులను అనుసంధానంచేసే ప్రక్రియ రూపుదాల్చుతోంది. ఈ మూడు రిజర్వాయర్ల ఆయకట్టు స్థిరీకరణ, ఏలేరు ఎడమ కాల్వ ఆయకట్టు, పారిశ్రామిక అవసరాలు, ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్ధ్యం మేరకు గోదావరి నది నీటితో నింపే విధంగా తాజా ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. ఇందుకు సంబంధించిన అధ్యయన ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించారు.
ఏలేరుకు 2232 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం వుంది. నికర నిల్వ సామర్ధ్యం 24.11 టీఎంసీలు కాగా ఎఫ్‌ఆర్‌ఎల్ ప్లస్ 284 మీటర్లు. తూర్పు కనుమల్లోని సాంబారు కొండల్లో ఉద్భవించి చిన్న చిన్న కాల్వల సమ్మేళనంగా ప్రవహించి రిజర్వాయర్‌లోకి చేరుతుంది. అక్కడ నుంచి 128 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ రిజర్వాయర్ నుంచి ఏడాదికి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 5 టీఎంసీలు సరఫరా చేసేలా డిజైన్‌చేశారు. రిజర్వాయర్ నిర్మించక ముందే ఏలేరు కింద 41,700 ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. 94 క్యూసెక్కులతో మొదట్లో 1.34 లక్షల ఎకరాలు సాగయ్యేలా డిజైన్‌చేశారు. ఎడమ కాల్వ పొడవు 113.30 కిలోమీటర్లు కాగా మరో 33.609 కిలోమీటర్లు తవ్వాల్సి వుంది. గోదావరి తూర్పు డెల్టా ప్రధాన కాల్వ నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్‌ను 19.65 కిలోమీటర్లు తవ్వనున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ అందుబాటులోకి వస్తే ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు కింద ప్రత్యేకించి 1.44 లక్షల ఆయకట్టు ఏలేరు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందుబాటులోకి రానుంది. ఏలేరు రిజర్వాయర్ మొదటి దశ పనులు 1991లోనే పూర్తయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *