వన్డే సిరీస్‌ భారత్‌ కైవసం

Sports

ఆంటిగ్వా : వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన చివరి, మూడో వన్డేలో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్నారు. స్మృతీ మంధాన చెలరేగడంతో భారత్‌ అవలీలగా విండీస్‌ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని 47 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్‌(69; 92 బంతుల్లో 6 ఫోర్లు), స్మృతి మంధాన(74; 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ప్రధానంగా మంధాన మెరుపులు మెరిపించడంతో భారత్‌ 42.1 ఓవర్లలోనే విజయం సాధించగల్గింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన మంధాన రీఎంట్రీలోనే అదరగొట్టింది. తొలి వికెట్‌కు 141 పరుగులు జత చేసిన తర్వాత రోడ్రిగ్స్‌ ఔట్‌ అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటయ్యారు. విండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌(79) మరోసారి రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్‌ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్‌, దీప్తి శర్మలు తలో వికెట్‌ తీశారు. మూడు వికెట్లు రనౌట్ల రూపంలో రావడం విశేషం.

మంధాన ఖాతాలో మరో ఘనత
భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన ఖాతాలో మరో ఘనత చేరింది. వన్డేల్లో రెండు వేల పరుగుల మార్కును మంధాన చేరుకున్నారు. వెస్టిండీస్‌తో బుధవారం భాగంగా ఆఖరి వన్డేలో మంధాన 63 బంతుల్లో 74 పరుగులు చేశారు. ఈ కమ్రంలోనే వన్డే ఫార్మాట్‌లో 2,025 వన్డే పరుగులతో ఉన్నారు. అయితే వేగవంతంగా రెండు వేల పరుగుల్ని సాధించిన రెండో భారత క్రికెటర్‌గా మంధాన ఘనత సాధించారు. శిఖర్‌ ధావన్‌ రెండు వేల వన్డే పరుగుల్ని 48 ఇన్నింగ్స్‌లో పూర్తిచేయగా… మంధాన 51 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు వేల పరుగుల్ని పూర్తిచేసుకొని రెండోస్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *