ఆ రెండు జిల్లాలపై జగన్ ఫోకస్ వెనక…!

Politics

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు, సరికొత్త పథకాలు అమలు చేస్తూ పాలనలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అలాగే నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు ఇస్తున్నారు. అయితే పథకాలు, అభివృద్ధి విషయంలో అన్నీ జిల్లాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న జగన్…పదవుల విషయంలో రెండు జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే.

గత 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ రెండు జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారం దక్కించుకుంది. పవన్ మద్ధతుతో పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసేసింది కూడా. ఇక మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో అన్నీ జిల్లాలో సత్తా చాటిన జగన్…ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లే దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మిగతా జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు రావడంతో ఉభయ గోదావరి జిల్లాలు అంత ముఖ్యపాత్ర పోషించలేదు. కానీ సుదీర్ఘ కాలం పాటు సీఎంగా పని చేయాలనుకుంటున్న జగన్…గోదావరి జిల్లాలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడితే మంచిదని భావిస్తున్నారు.

అందుకనే పదవుల పంపకంలో రెండు జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు మూడు, పశ్చిమ గోదావరికి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే రెండు జిల్లాలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈ రెండు జిల్లాలో కీలకంగా ఉండే బీసీ, కాపు నేతలకే డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. అలాగే ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన నేతలకు పలు కీలక పదవులు ఇస్తున్నారు. మొన్న ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు వైసీపీకి మద్ధతు తెలిపాయి. కానీ భవిష్యత్ లో కాపులు జనసేన వైపు, బీసీలు టీడీపీ వైపు వెళ్ళే ప్రమాదం ఉంది.

ఆ ప్రమాదాన్ని ముందుగానే గమనించి జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఇచ్చారు. ఇక రెండు జిల్లాలో కీలక పథకాల ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. ఇటీవల గ్రామ సచివాలయ వ్యవస్థని తూర్పు నుంచి మొదలుపెడితే….వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని పశ్చిమ నుంచి ప్రారంభించారు. పైగా ఇటీవల రెండు జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నేతలని వైసీపీలో చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ విధంగా రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టి..భవిష్యత్ లో కూడా తిరుగులేని విజయాన్ని అందుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *