మినిస్టర్ రిపోర్ట్‌: ఈ మంత్రి ఎందుకు వెనక పడ్డారు…!

Politics

ఏపీలోని సీఎం జగన్ మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారు అతి తక్కువగా ఉన్నారు. ఆ అతి తక్కువ మందిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ కూడా ఒకరు. మొన్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన….టీడీపీ సీనియర్ నేత బికే పార్థసారథిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్న వారిని పక్కనబెట్టి జగన్ శంకర నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టేశారు.

అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం…వెంటనే మంత్రి పదవి రావడంతో శాఖపై పట్టు సాధించుకోవడంలో శంకర నారాయణ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి పదవి చేపట్టి నాలుగు నెలలు దాటిన పూర్తిగా శాఖపై పట్టు దక్కించుకోలేకపోయారు. అయితే శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలని ఒక్కసారి గమనిస్తే…జగన్ నేతృత్వంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కులధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పులు, తదితర అంశాలపై కమిషన్‌ పనిచేస్తుంది.

వైఎస్సార్‌ కళ్యాణ కానుక కింద బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేలు సాయం చేయనున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ పేరుతో బీసీలకు సబ్సీడీ రుణాలు అందిస్తున్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం, మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. త్వరలోనే షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం, 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.

ఇవేగాక సీఎం జగన్ బీసీల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాలన్నీ జగన్ ఆధ్వర్యంలో మంత్రి అమలు చేస్తున్నారు. అందులో కూడా మంత్రి ఎఫెక్టివ్ గా పని చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో పర్వాలేదనిపిస్తున్నారు. అటు ఎమ్మెల్యేగా కూడా నియోజకవర్గంపై పెద్ద పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అనుభవం తక్కువ ఉండటం వల్ల శంకరనారాయణ కాస్తా వెనుకబడ్డారనే చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *