అశ్విన్‌ నా రికార్డును అధిగమిస్తాడు: భజ్జీ

Sports

పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే 600 వికెట్లు తీయగలడు

దిల్లీ: టీమిండియా టెస్టు బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొడతాడని సీనియర్‌ ఆఫ్‌ స్పి్న్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన విశాఖ టెస్టులో అశ్విన్‌ 66 మ్యాచ్‌ల్లోనే 350 వికెట్లు తీసి శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ సరసన చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భజ్జీ ఓ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా పేర్కొన్నాడు. స్వదేశంలో అశ్విన్‌ బౌలింగ్‌ సామర్థ్యంపై చాలా మంది మాట్లాడతారని, అయితే ఒక్క విషయం గుర్తించాలని చెప్పాడు. ఇవే పిచ్‌లపై ఇతర స్పిన్నర్లు కూడా బౌలింగ్‌ చేస్తారని, అయితే అశ్విన్‌లా వారు రాణించలేరని చెప్పాడు.

టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ప్రస్తుతం హర్భజన్‌(417) కొనసాగుతున్నాడు. అనిల్‌కుంబ్లే(619), కపిల్‌దేవ్‌(434) అతడికన్నా ముందున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ కచ్చితంగా తన రికార్డు బద్దలు కొడతాడని, పూర్తి ఫిట్‌నెస్‌తో దీర్ఘకాలం కొనసాగితే 600 వికెట్లను కూడా దాటేస్తాడని భజ్జీ అన్నాడు. తమిళనాడు స్పిన్నర్‌ ఫిట్‌గా ఉంటే ఏ రికార్డునైనా అధిగమించగలడన్నాడు. అశ్విన్‌ ఇప్పటివరకు టెస్టుల్లో 350 వికెట్లు తీయగా, స్వదేశంలో ఆడిన 39 మ్యాచ్‌ల్లోనే 242 వికెట్లు పడగొట్టాడు. మిగతా 108 వికెట్లు విదేశీ గడ్డలపై సాధించాడు. ఇక ఉపఖండంలో ఆడిన విషయానికి వస్తే మొత్తం 46 మ్యాచ్‌ల్లో 285 వికెట్లు పడగొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *