త్వరలోనే బెరన్‌డార్ఫ్‌కి సర్జరీ

Sports

త్వరలో న్యూజిలాండ్‌కు పయనం

సిడ్నీ: ఆస్ట్రేలియా పేసర్‌ జేసన్‌ బెరన్‌డార్ఫ్‌ కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శస్త్రచికిత్స చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. వెన్నునొప్పిపై అనేక మందితో చర్చించాక బాగా ఆలోచించి శస్త్రచికిత్సకు సిద్ధమయ్యానని బెరన్‌డార్ఫ్‌ చెప్పినట్లు ఆ ఛానెల్‌ పేర్కొంది. వెన్నునొప్పి సమస్యకి సర్జరీ చేయించుకోవడమే ఉత్తమ పరిష్కారమని అతడు పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన బెరన్‌డార్ఫ్‌ తొమ్మిది వికెట్లు తీయడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సమస్యతో బాధపడిన ఆసీస్‌, న్యూజిలాండ్‌ బౌలర్లను సంప్రదిస్తే సర్జరీ తర్వాత మంచి ఫలితం ఉన్నట్లు చెప్పారని బెరన్‌డార్ఫ్‌ చెప్పుకొచ్చాడు. మరికొద్ది రోజుల్లో తన కుటుంబంతో కలిసి కివీస్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుంటానని ఆసీస్‌ పేసర్‌ స్పష్టంచేశాడు. అయితే, వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై సమాచారం లేకపోయినా అప్పటికల్లా కోలుకుంటాడని తెలుస్తోంది. మరోవైపు ఆసీస్‌ పేసర్‌ జేమ్స్‌ పాటిన్‌సన్‌ కూడా 2017 జనవరిలో ఇదే సర్జరీ చేసుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు జట్టులో కొనసాగుతుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *