రేపు అనంతపురం పర్యటనకు వైఎస్ జగన్: స్కూలు పిల్లలు సహా..!

News

అనంతపురం: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకం అమల్లోకి రానుంది. పాఠశాల విద్యార్థులకు కూడా వర్తింపజేసిన పథకం- వైఎస్సార్ కంటి వెలుగు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో గురువారం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసింది. స్థానిక ప్రభుత్వ కళాశాల గ్రౌండ్స్ లో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు.

12 లక్షల మందికి పైగా..

మొత్తం ఆరు దశల్లో ఈ పథకాన్ని నిర్వహిస్తారు. తొలి రెండు దశలను విద్యార్థులకు పరిమితం చేశారు. రాష్ట్రంలో సుమారు 75 లక్షలమందికి పైగా పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు ఓ అంచనా. తొలి, రెండు దశల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి చదువుకుంటున్న ఆ విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. చివరి నాలుగు దశల్లో సామాన్య ప్రజల కోసం కంటి వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహిస్తారు. అంధత్వ నివారణ కింద 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దశలవారీగా వారందరికీ పాఠశాలల్లోనే కంటి పరీక్షలను చేపడతారు. కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తారు.

డీఎంహెచ్ఓలకు బాధ్యత..

రెండో దశలో సామన్య ప్రజల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలను నిర్వహిస్తారు. దీనికోసం ప్రభుత్వం 560 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. వచ్చే మూడేళ్లలో అంటే.. 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యతలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులకు అప్పగించారు. వారి పర్యవేక్షణలోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం కొనసాగుతుంది. కలెక్టర్ కు తమ తుది నివేదికను అందజేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన విధి విధానాలను వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇదివరకే నిర్ధారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *