విశాఖ ఎయిర్‌పోర్టులో తడిచిన భారత ఆటగాళ్లు.. అసహనం వ్యక్తం చేసిన రోహిత్!!

Sports

విశాఖ: విశాఖ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. రెండో టెస్టు కోసం పుణె బయలుదేరిన కోహ్లీసేన ఎయిర్ పోర్టులో కురిసిన వర్షంలో తడిచారు. దీంతో విమానాశ్రయంలో టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు బాగా ఇబ్బందులు పడ్డారు. పోలీసుల అవగాహన లోపంతో ఆటగాళ్లు అందరూ వర్షంలో తడిచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనతో ఓపెనర్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేసాడు.

మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో చివరి రోజైన ఆదివారం భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం మ్యాచ్‌ ముగియగా.. సోమవారం రెండు జట్లు పుణెకు బయల్దేరాయి. ఆటగాళ్లు బసచేసిన ప్రాంతం నుంచి బోర్డు ఏర్పాటు చేసిన బస్సుల్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మూడు ఫ్లాట్‌ ఫామ్‌లు ఉండగా.. పోలీసుల అవగాహన లోపంతో భారత జట్టు ప్రయాణిస్తున్న బస్సును మూడో ఫ్లాట్‌ ఫారం వద్ద ఆపారు.

అదే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. అయితే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సాఫీగా ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లగా.. కోహ్లీసేన మాత్రం పైకప్పు లేకపోవడంతో వర్షంలో తడుచుకుంటూ లోపలికి వెళ్లింది. లగేజీ, కుటుంబ సభ్యులు ఉండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు తలపై బ్యాగులు అడ్డుగా పెట్టుకుని లోపలికి వెళ్లారు. మొదటి ఫ్లాట్‌ఫారంలో బస్సు ఎందుకు పార్క్‌ చేయలేదని ఎయిర్‌పోర్ట్‌ సీఐని రోహిత్‌ శర్మ ప్రశ్నించాడు. తొలి ఫ్లాట్‌ ఫారంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు నిలిపారని సీఐ చెప్పగా.. రోహిత్ ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడట.

తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, రోహిత్ రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *