హైదరాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత 10 నెలలుగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనాకు వ్యాక్సిన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, అధికారులందరికీ ధన్యవాదాలన్నారు. భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇంత మందికి వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడం చరిత్రలో ఇప్పటివరకు జరగలేదన్నారు.
