సిడ్నీ టెస్ట్ డ్రా..రికార్డుల మోత!

Sports

సాధారణంగా విజయం ఇచ్చే కిక్ మరేదీ ఇవ్వదు. కానీ, టెస్ట్ క్రికెట్ లో మాత్రం డ్రా కూడా ఒక్కోసారి ప్రత్యేకం అవుతుంది. సరిగ్గా అదే జరిగింది సిడ్నీ టెస్ట్ లో. ఒక పక్క ఆసీస్ బౌలర్లు బౌన్సర్ల నిప్పులు కురిపించారు. మరో పక్క బాల్ కదలనీయకుండా వికెట్ చుట్టూ ఫీల్డర్లు మోహరించారు. అయినా, భారత బ్యాట్స్ మెన్ ఎక్కడా తలవంచలేదు. ధైర్యంగా నిలబడ్డారు. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 13౧ ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను కాచుకుని మ్యాచ్ డ్రా చేశారు. రిషబ్ పంత్(97) వీరోచిత ఇన్నింగ్స్ కు తోడుగా పుజారా, విహారి, అశ్విన్ పోరాట పటిమ కంగారూలను నిశ్చేష్టులను చేసింది.

ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది.

– రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ 131 ఓవర్లు ఆడి మ్యాచ్‌ను డ్రా చేయడం ఇదే మొదటిసారి. గతంలో 2015లో సిడ్నీలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 89.2 ఓవర్లు ఆడి ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

– 56 ఏళ్ల తర్వాత ఎక్కువ బంతులు రెండో ఇన్నింగ్స్ లో ఆడారు. మొత్తం సిడ్నీ టెస్టులో 786 బంతులు ఆడారు భారత్ బ్యాట్స్ మెన్. 1964లో సౌతాఫ్రికా కూడా ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు 117 ఓవర్లు ఆడింది.

– ఈ శతాబ్ధంలో అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బౌలర్ గా ఆస్ట్రేలియా బౌలర్ జోస్ హేజల్‌వుడ్ రికార్డ్ సృష్టించాడు. అతను మొత్తం 26 ఓవర్లు బౌలింగ్ వేసి 39 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

– రెండవ ఇన్నింగ్స్‌లో హనుమా విహారీ 161 బంతులు ఆడి 23 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టెస్టు చరిత్రలో ఇంత నిదానంగా ఆడిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది. ఇటీవల అత్యంత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ప్లేయర్లలో హసీమ్ ఆమ్లా ఉన్నాడు.

– చతేశ్వర్ పుజారా పోరాటం చెప్పుకోవాల్సిందే. అతను 200 బంతులకు పైగా బంతులు ఆది కేవలం 77 పరుగులే చేశాడు. ఇంత నిదానంగా ఆస్ట్రేలియాపై గతంలో సునీల్ గవాస్కర్ మాత్రమే ఆడగలిగాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *