లిఫ్ట్‌గుంతలో పడి వాచ్‌మన్‌ మృతి

Crime

మియాపూర్ : నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా.. ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి లిఫ్ట్‌గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌నగర్‌ ధర్మారెడ్డికాలనీలో వాసం షెట్టి త్రిమూర్తులు(41) భార్య, కుమారుడితో కలిసి నివాసముంటూ స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం రాత్రి 11.30గంటల సమయంలో భవనం వద్దకు ఇసుక లారీ వచ్చింది. ఇసుకను అన్‌లోడ్‌ చేస్తుండగా పరిశీలించేందుకు తన కుమారుడితో కలిసి త్రిమూర్తులు అక్కడికి చేరుకున్నారు. కాగా 5వ అంతస్థులో ఉన్న టార్పాలిన్‌ను తీసుకువచ్చేందుకు వెళ్లిన ఆయన దాన్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి లిఫ్ట్‌ గుంతలో పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన త్రిమూర్తులును చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *