గవర్నర్ పదవి ఇప్పిస్తానంటూ రిటైర్డ్ జడ్జికి రూ.8.8 కోట్లు టోకరా

Crime

బెంగళూరు : గవర్నర్ పదవిపై ఆశపెట్టుకున్న రిటైర్డ్ జడ్జి దారుణంగా మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయంటూ ఓ మోసగాడు ఆ రిటైర్డ్ జడ్జి నుంచి దాదాపు రూ.8.8 కోట్లు కొట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరు నగర క్రైమ్ బ్యూరో (సీసీబీ) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోసగాడిని గుర్తించారు.

సీసీబీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హెచ్ఎం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలు, రిటైర్డ్ జడ్జి గత ఏడాది డిసెంబరు 21న విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వద్ద నుంచి యువరాజ్ స్వామి రూ.8.8 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని స్వామి తనకు చెప్పారని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుకు గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్ర మంత్రులను కోరేందుకు మంగళూరుకు చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారితోపాటు స్వామి గతంలో ఢిల్లీ వెళ్ళారని తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. స్వామికి బాధితురాలిని ఆ రిటైర్డ్ పోలీసు అధికారి పరిచయం చేశారని, స్వామి నుంచి ఆ అధికారి రూ.2.75 కోట్లు తీసుకున్నారని తెలిసిందని తెలిపారు. ఆ రిటైర్డ్ పోలీసు అధికారిని ప్రశ్నించవలసి ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *