దిల్లీ: కొవిడ్-19 నివారణకు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం భారత్లో ప్రారంభం కానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. ‘భారత్లో తయారీ’ టీకాలను సాకారం చేసిన శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణులను ఆయన కొనియాడారు. వీరు దేశానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన భారత తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్, సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన జాతీయ తూనికలు, కొలతల సదస్సులో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సును శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్)కి చెందిన నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ (ఎన్పీఎల్) నిర్వహించింది. ఈ సందర్భంగా మోదీ.. ‘జాతీయ పరమాణు కాలమానాన్ని’, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య’ను జాతికి అంకితం చేశారు. జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబొరేటరీకి శంకుస్థాపన చేశారు.
