కీసర : ప్రతి రోజూ మద్యం తాగి వేధిస్తున్నాడు.. ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదు.. రోజు రోజుకు వేధింపులు ఎక్కువవుతూనే ఉన్నాయి.. తట్టుకోలేక రోకలిబండతో భర్త తలపై కొట్టి చంపేసింది. ఈ సంఘటన కీసర పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ నరేందర్‌గౌడ్ వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్, సరోజ దంపతులు బతుకుదెరువు కోసం నాగారం మున్సిపల్ పరిధిలోని బాపూజీనగర్ కాలనీకి విచ్చేసి నివాసం ఉంటున్నారు. వీరికి మూడేండ్ల కూతురు సంతానం. శ్యామ్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. రోజూ తాగి వచ్చి భార్యను వేధిస్తున్నాడు.. శనివారం రాత్రి కూడా బాగా తాగి వచ్చి వేధించాడు.. తట్టుకోలేక రోకలిబండతో భర్త తలమీద మోది చంపేసింది. ఆదివారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
