ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి

Sports

మైదానం చూస్తే చాలా చిన్నది.. పైగా బ్యాటింగ్‌ పిచ్‌.. ఇంకేముంది.. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సొమ్ము చేసుకుంటూ సంజూ శాంసన్‌ చెలరేగాడు. బంతి పడిందే ఆలస్యం.. చూడాల్సింది ఆకాశం వైపే అనే తరహాలో ఏకంగా 9 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఆఖర్లో ఆర్చర్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ జట్టు చెన్నై ముందు రికార్డు లక్ష్యాన్ని ఉంచగలిగింది. కానీ అత్యంత సీనియర్‌ లైనప్‌ కలిగిన సీఎ్‌సకే మాత్రం తమ బ్యాట్లను ఝుళిపించలేకపోయింది. అయితే డుప్లెసి ఒక్కడే కాస్త పోరాడినా సహకారంకరువైంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 33 సిక్సర్లతో 416 పరుగులునమోదయ్యాయి.

షార్జా: ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ప్రారంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ అందుబాటులో లేకపోయినా పటిష్ఠ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 1 ఫోర్‌, 9 సిక్సర్లతో 74), స్మిత్‌ (47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69) అద్భుత ఇన్నింగ్స్‌తో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో ఆర్చర్‌ (8 బంతుల్లో 4 సిక్సర్లతో 27) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. సామ్‌ కర్రాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. డుప్లెసి (37 బంతుల్లో 1 ఫోర్‌, 7 సిక్సర్లతో 72) పోరాడినా ఫలితం లేకపోయింది. తెవాటియాకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు.

వికెట్లు టపటపా

217 పరుగుల రికార్డు లక్ష్యం కోసం బరిలోకి దిగిన చెన్నైని స్పిన్నర్‌ రాహుల్‌ తెవాటియా దెబ్బతీశాడు. కుదురుకుంటున్న దశలో వరుస వికెట్లతో ప్రత్యర్థిని కోలుకోకుండా చేశాడు. ఆరో ఓవర్‌లో షేన్‌ వాట్సన్‌ (33) వరుసగా 6,6,4తో గేరు మార్చడంతో ఇక పరుగుల వరద ఖాయమే అనిపించింది. కానీ ఈ స్థితిలో తెవాటియా అతడిని అవుట్‌ చేసి గట్టి దెబ్బ తీశాడు. ప్యాడ్‌కు తగిలిన బంతి వికెట్ల మీదికి వెళ్లడంతో ఏడో ఓవర్‌లో తను బౌల్డ్‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే విజయ్‌ (21)ను మరో స్పిన్నర్‌ గోపాల్‌ అవుట్‌ చేశాడు. ఇక తెవాటియా తొమ్మిదో ఓవర్‌లో ధాటిగా ఆడుతున్న సామ్‌ కర్రాన్‌ (17), రుతురాజ్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో సీఎస్‌కే తొలి 10 ఓవర్లలో 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేదార్‌ జాదవ్‌ (22) హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.

డుప్లెసి పోరాటం

13.5 ఓవర్‌లో ధోనీ బరిలోకి దిగగా అప్పటికి 38 బంతుల్లో 103 పరుగులు కావాలి. మరో ఎండ్‌లో డుప్లెసి కూడా ఉండడంతో చెన్నై ఆశలు వదులుకోలేదు. 15వ ఓవర్‌లో డుప్లెసి రెండు సిక్సర్లతో 16 పరుగులు రాబట్టినా సాధించాల్సిన రన్‌రేట్‌ 20కి పైగా వెళ్లింది. అటు ధోనీ నిదానంగా ఆడుతూ నిరాశపరిచినా 17వ ఓవర్‌లో డుప్లెసి మూడు సిక్సర్లతో 21 రన్స్‌ సాధించాడు. 29 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక 12 బంతుల్లో 48 రన్స్‌ అవసరం కాగా ప్రతీ బాల్‌ ఫోర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్చర్‌ ఓవర్‌లో భారీ సిక్సర్‌ సాధించాక డుప్లెసి.. శాంసన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించినా ఫలితం లేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *