వీడియో కాల్‌ మాట్లాడుతూ శస్త్రచికిత్స!

Crime

హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యంతో సిజేరియన్‌ శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సార్‌నగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డి వివరాల ప్రకారం.. గాయత్రిహిల్స్‌లోని నవభారత్‌నగర్‌కు చెందిన ఎం.జానకి(23)కి పురిటినొప్పులు ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఉదయం శ్రీరామ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. 29న అర్ధరాత్రి 2.30 గంటలకు ఆసుపత్రిలోని వైద్యురాలు, మరో నర్సు, ఇతర సిబ్బంది సిజేరియన్‌ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఆ తరువాత జానకి ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 4.30 గంటలకు నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 30న ఉదయం ఆమె మృతి చెందింది. శస్త్రచికిత్స చేసిన సమయంలో ఓ నర్సు, మరో వైద్యురాలు వీడియో కాల్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో ఆపరేషన్‌ వికటించి జానకి మృతి చెందిందని ఆరోపిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్లక్ష్యం కింద వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. ఈ విషయమై వైద్యాధికారులను సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *