కరెంటు బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు: రఘుమారెడ్డి

Politics

హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచలేదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. గత మూడు నెలల బిల్లు ఒక్కసారిగా వచ్చేసరికి పెద్ద మొత్తంగా కనిపిస్తుంది చెప్పారు. లాక్‌డౌన్‌తో గత మూడు నెలలుగా మీటర్‌ రీడింగ్‌ తీయలేదని, లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్పారు. గృహ వినియోగంలో తొమ్మిది స్లాబ్‌లు, మూడు కేటగిరీలు ఉన్నాయని, స్లాబులు మారడం వల్ల కేటగిరీలు కూడా మారుతాయని వెల్లడించారు.

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 95.13 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారని చెప్పారు. ఇందులో 200 యూనిట్లకంటే తక్కువ వాడే వారు 86 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. విద్యుత్‌ వినియోగం పెరిగితే స్లాబ్‌రేటు మారుతుందని తెలిపారు. మార్చి నెలలో 67 శాతం మంది, ఏప్రిల్‌ నెలలో 44 శాతం మంది, మే నెలలో 68 శాతం మంది బిల్లులు కట్టారని చెప్పారు. మొత్తంగా ఈ మూడు నెలల్లో సరాసరి 60 శాతం మంది మాత్రమే విద్యుత్‌ బిల్లులు చెల్లించారని, మరో 40 శాతం మంది బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా విద్యుత్‌ బిల్లులు చెల్లించనివారికి ఎలాంటి ఫైన్‌ విధించలేదని చెప్పారు. బిల్లుల విషయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగితే దిద్దుకుంటామని చెప్పారు. బిల్లులు కట్టినివారు వెంటనే చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *