చేతులు కాలాకా పీసీసీ పదవి ఎందుకు…!

Politics

వారు ఇద్దరు బ్రదర్స్‌.. కాంగ్రెస్‌లో వారు తిరుగులేని నాయకులే.. వారి ప్రాంతంలో ఎదురులేని నేతలు.. అధికార పార్టీ అయినా, సొంత పార్టీ అయినా ఉన్నది ఉన్నట్లుగా వ్యతిరేకమైనా, అనుకూలమైనా కామెంట్లు చేస్తూనే ఉంటారు. అందుకే వారు కాంగ్రెస్‌లో ఓ ధిక్కార స్వరాలుగా మారారు… ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు.. కాంగ్రెస్‌లో ఎంత పెద్ద లీడరైనా పర్వాలేదు వారిని ఉతికి ఆరేయడం వారి పని.. అందులో ఒక బ్రదర్‌ది ఓ ప్రత్యేకమైన శైలీ.. మా ఏరియాలో మా అంత పోటుగాళ్ళు ఎవరు లేరనే ధీమా.. ప్రజలు మాకు అండగా ఉన్నారనే ధైర్యంతో పార్టీలోని ఏ స్థాయి నాయకుడినైనా ఎదిరిస్తారు.. అవసరమైతే ధిక్కరిస్తారు.. అంతలా కాదనుకుంటే ఎందాకైనా సిద్దమే అంటారు.. అలాంటి నేతలు వీరు.. అయితే కొద్దికాలంగా అన్నదమ్ముల్లో ఒకనేత ఇప్పుడు దారి తప్పారు.కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండలో తిరుగులేని నేతలు. వీరికి ప్రజలు అండదండలు పూర్తిగా అందిస్తారు.. అలాంటి ఈ బ్రదర్స్ ముందు నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు.

పార్టీలో పెద్దస్థాయి నేతలను కూడా ధిక్కరించి మాట్లాడుతారు. అయితే గత కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం అన్నను కాదని బీజేపీకి వెళ్ళెందుకు సిద్దమయ్యాడు. బీజేపీలో చేరడం ఖాయమన్నాడు.. తానే బీజేపీలో సీఎం అభ్యర్థిని అని స్వయంగా ప్రకటించుకున్నాడు.

దీంతో కాంగ్రెస్ పంపిన షోకాజ్ నోటీసు అందుకోవడం, వాటికి జడవకుండా ముందు అనుకున్నట్లే బీజేపీకి వెళుతున్నానని బహిరంగంగానే ప్రకటించడం జరిగిపోయాయి. అయినా పీసీసీ రాజగోపాల్‌రెడ్డి మీద ఏమైనా చర్యలు తీసుకుందా అది లేదు..అయితే ఇప్పుడు పీసీసీ ఛీప్ ఇస్తానంటే తీసుకుంటావా అని రాజగోపాల్‌రెడ్డిని అడిగితే చేతులు కాలాకా పీసీసీ పదవి ఎందుకు ? అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలోనే నాయకత్వం లేదని, అందుకు రాహుల్‌గాంధీ రాజీనామా చేసినప్పుడే తేలిపోయిందంటాడు.

ఇక కాంగ్రెస్‌లో ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆర్ సి కుంతియా తమ పదవులకు రాజీనామా చేస్తే కాంగ్రెస్‌కు ఏమైనా మంచి రోజులు వస్తాయని ఘంటాపధంగా చెప్పాడు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం అయిందని, బీజేపీకి అధికార పార్టీకే ఇక్కడ పోటీ అని స్పష్టం చేశాడు.కేసీఆర్‌ను కూడా కోమటిరెడ్డి ఆకాశానికెత్తడం ఇక్కడ కొసమెరుపు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఏ పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ వినరని, పాదయాత్రలు కాదు, మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లినా కేసీఆర్ పట్టించుకోరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఏమి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *